మంచి కథే కానీ… – అశ్వథ్థామ రివ్యూ

0
97

వరుస పరాజయలతో సతమతమవుతున్న నాగశౌర్య ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనే సొంతంగా కథ రాసుకొని మరి మనముందుకు తెచ్చిన సినిమా అశ్వథ్థామ. ఈ సినిమా కథ మనకు తెలియంది కాదు. అనగనగా ఓ సైకో నచ్చిన అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటాడు.ఎక్కడా చిన్న క్లూ కూడా వదలకుండా అందరికీ సవాల్ విసురుతుంటాడు. అందులో హీరో చెల్లి కూడా ఉంటుంది. దాంతో హీరో మిషన్ మొదలుపెడతాడు. ఇదే ఈ సినిమా కథ. కొత్త కథేం కాదు కానీ స్క్రీన్ ప్లే మాయ చేస్తే రాక్షసుడులాంటి సినిమా తీయొచ్చు.
కానీ కమర్షియల్ అంశాల కోసం అశ్వథ్థామున్ని పక్కదారి పట్టించారేమో అనిపించింది. తొలి అరగంట సినిమా హీరో ఇంట్రో.. అతడి ఫైట్స్ కోసమే తీసినట్లుంది సినిమా. మాస్ ఇమేజ్ కావాలని నాగశౌర్య యాక్షన్ సన్నివేశాలు తెగ పెట్టేసారు. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత కానీ అసలు కథ మొదలవ్వదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంది. ఇంటర్వెల్ నుంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. విలన్ ఎవరో తెలియకుండా సస్పెన్స్ మెయింటేన్ చేయడం మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఇంటర్వెల్‌కే విలన్‌ను చూపించి క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు రమణ తేజ. ఇక్కడే అసలు దెబ్బ పడిందేమో అనిపించింది. సస్పెన్స్ తొలగిపోవడంతో కథనం నెమ్మదించింది. హీరో ఎలా విలన్‌ను రీచ్ అవుతాడనే ఒక్క చిన్న ఇంట్రెస్ట్ తప్ప. కథలో కొత్తదనం కనబడలేదు. అమ్మాయిలను ట్రాప్ చేసే సైకోను పట్టుకోడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. విలన్‌ను చేరే చివరి అడుగు మాత్రం చాలా ఈజీగా తేల్చేసాడు దర్శకుడు.
అప్పటి వరకు ప్రపంచానికి కనబడని విలన్. హీరోకు అంత ఈజీగా దొరకడం సిల్లీగా అనిపిస్తుంది.
క్లైమాక్స్ మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా బాగుండేది. అమ్మాయిలను ఎత్తుకెళ్లి చంపేసే ప్రపంచానికి కనబడని సైకో కథలు చాలానే వచ్చాయి.
అశ్వథ్థామ కూడా అలాంటి థ్రిల్లరే. కానీ ఇలాంటి కథలో ఉండాల్సిన సస్పెన్స్ చాలా మిస్ చేసాడు.
నాగ శౌర్య యాక్షన్ హీరోగా బాగా నటించాడు. ఫైట్స్ బాగున్నాయి. మెహ్రీన్ పాటలకు, కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితం అయిపోయింది. విలన్‌గా నటించిన జిస్సు గుప్తా బాగున్నాడు. సైకోగా అతని నటన అదిరిపోయింది.

ఓవరాల్‌గా అశ్వథ్థామ మంచి కథే కానీ కథనం వీక్.

Rating – 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here